5, డిసెంబర్ 2010, ఆదివారం

కన్నీటి చారికనై కారంశంకర్

ఏ నిశబ్ద నిషిధీ లోనో
నువ్వు నా జ్ఞాపకాల తీరాల్లో
విహరిస్తున్నప్పుడు
ఆకస్మికంగానే నేను నీ ముందు
ప్రత్యక్ష మవుతాను
ఆత్మీయతని అనురాగాన్ని
నీ దోసిళ్ళలో పట్టుకుని
నువ్వు నాకోసం కలవరపడ్డప్పుడు
ప్రేమ పావురాన్నైనీ ముంగిట్లో వాలుతాను
నువ్వు
ఆకస్మికంగా నన్ను చూసినప్పుడు
ఉప్పొంగే కెరటాని వవుతావు
నీ నవ్వులు పరిమళించే పూలై
స్వాగతం పలుకుతాయి
నీ ముచ్చట్లు సెలయేటి లా గల గలా
పరవళ్ళు తొక్కు తాయి
ప్రియతమా !
మన మనోగతాల్ని అవిష్కరిచుకోలేక
మది లో నే సమాధి చేసుకున్నవాళ్ళం
ఇన్నాళ్ళు నీ సాన్నిధ్యం లో ఒయాసిస్సు వై
సేద తీర్చావు ఆప్యాయత కురిపించి
అభిమానించావు
నీ అనురాగాన్ని జీవితకాలం
పంచుకోవాలను కోవటం ఒట్టి భ్రమే నంటావా
నింగి లోని జాబిల్లి ని అందుకోవడం
నా పిచ్చి గాని...
నీతో సాగి పోవాలనుకోవడం
నా అవివేకమే కదా
ఏది ఏమైనా నేను నీ అరాధకుడిని
స్వాప్నిక లోకాల్లో విహంగా న్నై
సంచరించేవాన్ని !
నీ కోసం అన్వేషించే వాన్ని!
ఇప్పుడు
ప్రతి ఉదయ సాయంకాలాల్లోను
నీలాకాశం లో నీ ప్రతిబింబం కోసం
అన్వేషిస్తాను
ప్రతి నిత్యం
నా అరచేతుల్లో నీ ముఖ వర్చస్సును
దర్శిస్తాను
ప్రేమసరోవరం లో వెలసిన నవ పారిజాతానివి నువ్వు
నా హృదయ కవాటాలు తెరిచాను
ప్రియసఖీ రా !
నిన్ను నా గుండెల్లో పోదు వుకుంటాను
లేదంటే ఒక జ్ఞాపకా న్నై
ఒక అనుభూతి నై నీ చుట్టూర పరిభ్రమిస్తాను
చెక్కిలి పై కన్నీటి చారికనై నిలిచిపోతాను



4, డిసెంబర్ 2010, శనివారం

ప్రేమ గీతం

ప్రేమ గీతం కారంశంకర్
నా గుండెల్ని మీటుకుంటూ
ఓ జ్ఞాపకం నా మీదుగా నడుచుకుంటూ
వెళుతుంది
రెక్కల్లేని పక్షోక్కటి రివ్వున ఎగిరి
నా హృదయం పై వాలుతుంది
ఎన్నో అనుభుల చుంబ నాల్లో
తడిసి ముద్దనవుతూ ...
సఖీ
నేను భగ్న ప్రేమికుడినో కాదో నువ్వే
చెప్పాలి అనంతమైన నా ప్రేమ స్వరూప
ఫరిధిని హద్దుగా గీయలేను
నా ప్రేమకు చిహ్నంగా మరో తాజ్ మహల్
నిర్మించ లేను
కానీ ఇప్పుడు నేను నిర్మించ బోయే మహల్ కు
విస్తృత మైన ఫరిది కావాలి
భూమ్యాకాశాలు చాలవేమో ప్రియా
నిత్యగాయలనది కారంశంకర్

నా హృదయం ఒక నిత్య గాయలనది
ఎన్నో బాధల బరువుల్ని మోస్తుంది
ఏ సానుభూతి లేపనాన్ని పూయకు
గాయపడ్డ ప్రతిసారి ఓ కొత్త పాఠాన్ని
నేర్చుకుంటాను
ఒక చక్రాన్ని సానబెడతాను
నన్నింకా గాయపర్చు
మళ్లీమళ్లీ గాయం చెయ్యు
దుఖం అంతుల్నిచూడాలి
ఎన్నో ఆలోచనా విస్పోట నాల్లో
దగ్దమవ్వాలి
నాలోని నది మీద దాడి చేస్తావా చెయ్యు
వేదన వెన్నెలై కురుస్తుంది
ప్రకాశిస్తున్న వెన్నెల్లో నీ గమ్యాన్ని వెతుక్కో
దుఖపు గుండెల్లో జొరబడ్డ వాణ్ణి
బాధకి పర్యాయ పదమైన వాణ్ణి
బాధ పెడుతున్నందుకు ధన్యవాదాలు
ప్రత్యక్షం గానో పరోక్షంగానో
బహిరంగంగానో రహస్యం గానో
నాపై కుట్ర పన్ను తున్నందుకు కృతఙ్ఞతలు
దుఃఖ పడకుండా జీవితం వ్యర్థ మై పోతుందేమో నన్న
దిగులు లేకుండా చేస్తున్నందుకు
నా హృదయాన్ని నిత్య గాయాల నది గా మారుస్తున్నందుకు
చేతులెత్తి నమస్కరిస్తున్నాను
నా అంతరంగ ద్వారాలకు స్వాగత ప్రవచనాల
ఫలకాలని ఎప్పుడో తగిలించాను
శత్రువుగానో మిత్రుడి గానో నువ్వు రావాలి
నాజోలికి రాకుండా మాత్రం వుండకు
అప్పుడప్పుడు గాయం చేస్తూ వుండు
లేదంటే ...
నది ఒక్కోసారి ఘనీభవిస్తుంది
నిర్చలత్వాన్ని నేను స్వాగతించలేను

3, డిసెంబర్ 2010, శుక్రవారం

అంతర్ముఖ చిత్రం                                                     కారంశంకర్

మనకళ్ళు అమాయకమైనవి
భౌతిక స్వరూపల్నె చిత్ర్రిస్తుంటాయి
వాటినెప్పుడు నమ్ముకోవద్దు
ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు
భ్రమింపజేస్తాయి
మనచేవుల్నికుడా అనుమానించాలి
నిజాల్ని అబద్దంగాను అబద్దాన్ని
నిజంగాను నమ్మిస్తాయి 
అవి ఒకదాన్ని మరొకటి బలపర్చుకుంటాయి
నీతి వాక్యాలి ప్రభోదిస్తూ
తీపి పడాల గుభాలింపు తో
మనల్ని లోబర్చుకునే వాడుంటాడు
పరకాయ ప్రవేశంలో సిద్దహస్తుడు
ఓర్వలేనితనం స్వార్థం కపటం కుళ్ళు
వాడి రక్త కణాల్లో ప్రవహిస్తూనే వుంటాయి
మనిషి తనాన్ని కప్పేసుకుంటూ
అనేక రూపాల్లో సంచరిస్తాడు
మేధావిగానో నాయకుడి గానో డాక్టర్ గానో
సంఘ సేవకుడి గానో విద్యావేత్త గానో
నీ ముందు కోస్తాడు కాటు వేయడానికి
కాచుకుంటాడు
అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని
మనలో మంచితనాన్నే వాడు
ఆయుధంగా మలుచుకుంటాడు
మనిషి తనన్నే ధ్వంసం చేస్తున్న వాడు
వన్నిప్పుడు మనిషి అంటున్నాం
అంతర్ముఖల్ని చిత్రించే మనో నేత్రం
మనలోనే వుంది
మనమిక మనిషెవరో నిర్ధారించు కోవచ్చు
సాహిత్యప్రస్తానం జూన్ జూలై 2007