4, డిసెంబర్ 2010, శనివారం

నిత్యగాయలనది కారంశంకర్

నా హృదయం ఒక నిత్య గాయలనది
ఎన్నో బాధల బరువుల్ని మోస్తుంది
ఏ సానుభూతి లేపనాన్ని పూయకు
గాయపడ్డ ప్రతిసారి ఓ కొత్త పాఠాన్ని
నేర్చుకుంటాను
ఒక చక్రాన్ని సానబెడతాను
నన్నింకా గాయపర్చు
మళ్లీమళ్లీ గాయం చెయ్యు
దుఖం అంతుల్నిచూడాలి
ఎన్నో ఆలోచనా విస్పోట నాల్లో
దగ్దమవ్వాలి
నాలోని నది మీద దాడి చేస్తావా చెయ్యు
వేదన వెన్నెలై కురుస్తుంది
ప్రకాశిస్తున్న వెన్నెల్లో నీ గమ్యాన్ని వెతుక్కో
దుఖపు గుండెల్లో జొరబడ్డ వాణ్ణి
బాధకి పర్యాయ పదమైన వాణ్ణి
బాధ పెడుతున్నందుకు ధన్యవాదాలు
ప్రత్యక్షం గానో పరోక్షంగానో
బహిరంగంగానో రహస్యం గానో
నాపై కుట్ర పన్ను తున్నందుకు కృతఙ్ఞతలు
దుఃఖ పడకుండా జీవితం వ్యర్థ మై పోతుందేమో నన్న
దిగులు లేకుండా చేస్తున్నందుకు
నా హృదయాన్ని నిత్య గాయాల నది గా మారుస్తున్నందుకు
చేతులెత్తి నమస్కరిస్తున్నాను
నా అంతరంగ ద్వారాలకు స్వాగత ప్రవచనాల
ఫలకాలని ఎప్పుడో తగిలించాను
శత్రువుగానో మిత్రుడి గానో నువ్వు రావాలి
నాజోలికి రాకుండా మాత్రం వుండకు
అప్పుడప్పుడు గాయం చేస్తూ వుండు
లేదంటే ...
నది ఒక్కోసారి ఘనీభవిస్తుంది
నిర్చలత్వాన్ని నేను స్వాగతించలేను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి